
సంతృప్త స్థాయిలో పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారులకు సరైన రీతిలో ఎండార్సెమెంట్ ఇవ్వకపోవడం వల్లే అసంతృప్తి స్థాయి పెరిగి జిల్లా ర్యాంకింగ్‌లో వెనుకబడి పోతున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న రీఓపెన్ దరఖాస్తులన్నీ ఈ వారం క్లియర్ చేయాలన్నారు. రెవెన్యూ దరఖాస్తులపై ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయపు ఫైళ్లన్నీ సంబంధిత అధికారుల ఈ సైన్‌తో ఈ ఆఫీస్ ద్వారానే సమర్పించాలన్నా రు. కార్యక్రమంలో 220 అర్జీలు వచ్చాయని, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వినతిదారులతో భోజనం..
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో పాల్గొన్న అర్జీదారులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి కలిసి భోజనం చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల కోసం ఓంకారంలోని శ్రీ కాశిరెడ్డి నాయన సత్రం ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో అర్జీదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. బాధిత కుటుంబంలోని వ్యక్తులతో కలిసి భోజనం చేస్తూ చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించారు. భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు.. అని పిల్లలను అడగగా వారు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ అవ్వాలనుకుంటున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా చిన్నారులకు మెరుగైన విద్యను అందించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. అర్జీదారులతో భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా విని స్పందించిన కలెక్టర్, అధికార యంత్రాంగం, ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా సేవా దృక్పదం మరింత బలపడుతుందన్నారు.