
కల్యాణ వీణ మోగేనా..
● పేదల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించిన
సిమెంట్ పరిశ్రమ
● నిర్వహణ పేరుతో ప్రైవేటుకు దీటుగా
వసూళ్లకు అధికారుల నిర్ణయం
కొలిమిగుండ్ల: పేదల కోసం రామ్‌కో సిమెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులతో నిర్మించిన ఫంక్షన్‌హాల్‌లో అధికారుల తీరుతో శుభకార్యాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్కెట్‌లో ఉన్న రేట్ల కంటే ఎక్కువగా రుసుం నిర్ణయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివాహాలు తదితర శుభకార్యాలు జరుపుకునేందుకు మండల కేంద్రంలో అనువైన కల్యాణ మండపాలు లేవు. పెళ్లిళ్లు జరుపుకోవాలంటే తాడిపత్రి, జమ్మలమడుగు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రజ ల అవసరాలను గుర్తించారు. సమస్యను రామ్‌కో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి అన్ని వసతులతో కూడిన ఫంక్షన్‌హాల్‌ను నిర్మించాలని కోరడంతో స్పందించారు. రూ.2.75 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు విడుదల చేయడంతో కాటసాని, జెడ్పీచైర్మన్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వంలోనే పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవం వాయి దా పడింది. కూటమి ప్రభుత్వం దాదాపు 15 నెలల తర్వాత గత నెల 30న ఈ ఫంక్షన్‌హాల్ ఎట్టకేలకు ప్రారంభించారు. దీనిని నిర్వహణ బాధ్యత మండల పరిషత్ అధికారులు తీసుకున్నారు. హాల్ మెయింటెన్స్, విద్యుత్ చార్జీలు తదితర వాటి కోసం మాత్రమే నామమాత్రంగా వసూలు చేసే విధంగా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం రేట్లు నిర్ణయించడంతో మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివాహాలకు రూ.25 వేలు, బర్త్‌డే, ఇతర కార్యక్రమాలకు రూ.15 వేలుగా రుసుం నిర్ణయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఫంక్షన్‌హాల్ నిర్మిస్తే ఎక్కువ మొత్తం వసూలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత మొత్తం చెల్లించి శుభకార్యాలు జరుపుకోవడం కంటే ఇతర ప్రాంతాలకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ఇవే రేట్లు ఉన్నాయని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోనికి తీసుకుని రేట్లు మార్చాలని కోరుతున్నారు. కాగా విషయంపై ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ప్రసాద్‌రెడ్డి వివరణ కోరగా.. ఫంక్షన్‌హాల్ మెయింటెన్స్ నిమిత్తం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేశామని, ఈ మేరకు శుభకార్యాలు నిర్వహించుకునే వారి కోసం రుసుం నిర్ణయించామన్నారు.