
భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించండి
నంద్యాల: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, రోడ్లు–భవనాల నిర్మాణం వంటి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణకు సంబంధించి ప్రతి ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరమవుతుందో సంబంధిత శాఖలు స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూముల వివరాలను సిద్ధం చేయడంలో ఆలస్యం జరిగితే సంబంధిత శాఖలపై బాధ్యత ఉంటుందన్నారు. భూముల ఫీజీబిలిటీని బట్టి ఆర్డీవోలు, తహసీల్దార్లు తనిఖీలు నిర్వహించి 26 డాక్యుమెంట్లతో కూడిన నివేదికను సమర్పిస్తే ప్రతిపాదనలు ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీకి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలు, సంక్షేమ వసతి గహాలు, కంప్రెష్డ్ బయోగ్యాస్ వంటి ప్రాధాన్యత ప్రాజెక్టులకు అడ్వాన్స్ పొజిషన్ ఇస్తామని, జీఓ వెలువడిన తర్వాతే సంబంధిత భూములను స్వాధీనం చేయడం జరుగుతుందన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
● ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
నంద్యాల: అంగన్‌వాడీ సెంటర్‌లో టీచర్‌గా, హౌసింగ్ ఆఫీస్‌లో వర్కింగ్ ఇన్‌స్పెక్టర్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, ఇలా వివిధ రకాలుగా ఉద్యోగం ఇప్పిస్తామంటూ నంద్యాలకు చెందిన వాహిదా అనే మహిళ మోసం చేసిందని గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన సమీరాతో పాటు మరికొందరు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు ఎస్పీని కలసి విచారించి తమకు న్యాయం చేయాలని, తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. పీజీఆర్‌ఎస్‌లో 95 వినతులు వచ్చాయి. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతామన్నారు.