
శ్రీగిరిలో నేటి నుంచి దేవీశరన్నవరాత్రోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: విజయ దశమి సందర్భంగా శ్రీగిరి క్షేత్రంలో సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు భ్రమరాంబాదేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈఓ ఎం.శ్రీనివాసరావు ఇటీవల అధికారులతో సమావేశమై భక్తులకు ఏలోటూ రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈఓ సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించబడే ఈ ఉత్సవాలలో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు.
నేడు ఉత్సవాలకు అంకురార్పణ
దసరా మహోత్సవాలకు నాందిగా సోమవారం ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేసి, గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనము, దీక్షాసంకల్పం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణపూజ, కంకణధారణ జరిపిస్తారు. అఖండ స్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, నవగ్రహ మండపారాధన, చండీకలశస్థాపనము, చతుర్వేద పారాయణలు, విశేష కుంకుమార్చనలు, గణపతి పంచాక్షరీ, కుంకుమార్చనలు, కుమారి పూజలు జరిపిస్తారు. ఉదయం 9.30 గంటలకు స్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం చేసి వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, అఖండదీపా స్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశ స్థాపన, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నకాలార్చనలు, మహానివేదనలు జరిపిస్తారు. సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, రుద్రహోమం, అమ్మవారికి నవావరణార్చన, కుంకుమార్చనలు జరిపిస్తారు. ఉత్సవ కార్యక్రమాల నిర్వహణలో దేవస్థాన అర్చకులు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉత్సవ నిర్వహణలో పాల్గొంటారు.
దసరా మహోత్సవాల్లో నేడు
దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంలో అదిష్టించి ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక అలంకృతులైన అమ్మవారిని, ప్రత్యేక వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తారు.
యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు
అంకురార్పణ
మొదటిరోజు శ్రీశైల భ్రామరీకి
శైలపుత్రి అలంకారం
భృంగివాహనంపై విహరించనున్న
స్వామిఅమ్మవార్లు

శ్రీగిరిలో నేటి నుంచి దేవీశరన్నవరాత్రోత్సవాలు