
నేడు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెనన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా "meekosam.ap.gov.in"లో ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్‌లైన్‌లో తెలుస్తుందని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చ ని పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను ముందుగా సంబంధిత మండల, డివిజన్, మున్సిపాలిటీలలో అధికారులకు ఇవ్వాలని అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రానికి రావాలని సూచించారు.
మహానందిలో 60.4 మిల్లీమీటర్ల వర్షం
నంద్యాల(అర్బన్): నంద్యాల జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మహానంది మండలంలో 60.4 మి.మీ వర్షం కురవగా డోన్‌లో అత్యల్పంగా 1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఆత్మకూరులో 52.8, రుద్రవరం 40.4, నంద్యాల అర్బన్ 28.4, శ్రీశైలం 24.2, కొత్తపల్లి 20.6, ఉయ్యాలవాడ 18.0, నంద్యాల రూరల్, చాగలమర్రి 15.2, పగిడ్యాల 14.6, శిరివెళ్ల 12.2, ఆళ్లగడ్డ, నందికొట్కూరు 12.0, మిడుతూరు 11.4, కొలిమిగుండ్ల 10, జూపాడుబంగ్లా 9.8, బండిఆత్మకూరు 9.2, వెలుగోడు 8.8, బనగానపల్లె 7.4, గడివేముల 4.2, గోస్పాడు 3.2, దొర్నిపాడు, బేతంచెర్ల 2.4, పాణ్యం 2.2, పాములపాడు 2, అవుకు 1.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
నంద్యాలకు బయలుదేరిన మహానందీశ్వరుడు
మహానంది: మహానందిలో కొలువైన గంగ, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దంపతులు ఆదివారం నంద్యాలకు బయల్దేరారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నంద్యాలలోని బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ముందుగా స్థానిక అలంకార మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, ముఖ్య అర్చకులు రాఘవశర్మ, మణికంఠశర్మ, అర్చకులు స్థానిక అలంకార మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య నంద్యాలకు పయణమయ్యారు.