
వజ్రాన్వేషణకు వచ్చి.. వరదనీటిలో చిక్కుకుని..
● తాళ్ల సాయంతో
ప్రాణాలు కాపాడిన స్థానికులు
మహానందిలో నేలకూలిన భారీ వృక్షం
తాళ్లసాయంతో వంకలో నుంచి బయటికి వస్తున్న బాఽధితులు
మహానంది: నల్లమలలోని సర్వనరసింహ స్వామి ఆలయ సమీపంలోని వజ్రాలవంక(వాగు)లో వజ్రాల అన్వేషణకు వచ్చిన వారిలో ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నల్లమలలో భారీ వర్షం కురవడంతో నీటిప్రవాహం అధికమైంది. వాగులో గుంతల లోతు తెలియని పలువురు వజ్రాన్వేషణకు వెళ్లగా గుంతల్లో పడ్డారు. వారిలో కొందరు మహిళలు, పురుషులు బయటికి రాగా ఒంగోలుకు చెందిన చిన్నయ్య, మరో ఇద్దరు ఈత రాకపోవడంతో చెట్టెక్కి కేకలేశారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆంజనేయపురం గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి తాళ్ల సాయంతో ముగ్గురిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు.
నేలకూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు..
శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దేవస్థానం పాత కార్యాలయం ముందు ఉన్న సుమారు వందల ఏళ్ల నాటి భారీ చింత వృక్షం నేలకొరిగింది. అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇదే చోట నాలుగు విద్యు త్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. నల్లమల అడవిలోనూ భారీ వర్షం కురవడంతో మహానంది నుంచి గాజులపల్లె వెళ్లే మార్గంలోని ఎంసీ ఫారం గ్రామం వద్ద ఉన్న పాలేరు వారు ఉప్పొంగి ప్రవ హించింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ రమాదేవి, విద్యుత్ ఏఈ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
నంద్యాల(అర్బన్): జిల్లాను వర్షాలు వీడటం లేదు. పది రోజులుగా మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా రుద్రవరంలో 40.2 మి.మీ, అత్యల్పంగా వెలుగోడు, బనగానపల్లె మండలాల్లో 1.0 మి.మీ వర్ష పాతం నమోదైంది. మహానందిలో 29.2, సంజామల 25.2, నంద్యాల అర్బన్ 19.6, ఉయ్యాలవాడ 19.4, గోస్పాడు 15.0, శిరివెళ్ల 11.0, ఆళ్లగడ్డ 10.0, కొత్తపల్లె, నంద్యాలరూరల్ 8.6, కోవెలకుంట్ల 6.2, దొర్నిపాడు 4.8, కొలిమిగుండ్ల, చాగలమర్రి 4.6, బండిఆత్మకూరు 3.0, మి.మీ వర్ష పాతం నమోదైంది. కోవెలకుంట్ల – జమ్మలమడుగు రహదారిలో గోవిందపల్లె సమీపంలో చెరువు ఉప్పొంగడంతో నీటి ప్రవాహంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిలిచిపోయింది. 30 మంది ప్రయాణికులను పోలీసులు జేసీబీ ద్వారా ఒడ్డుకు చేర్చారు.

వజ్రాన్వేషణకు వచ్చి.. వరదనీటిలో చిక్కుకుని..