
స్వచ్ఛ నంద్యాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
బొమ్మలసత్రం: స్వచ్ఛ నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ శివారులోని డంప్‌యార్డులో మంత్రితో పాటు కలెక్టర్ రాజకుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, కమిషనర్ శేషన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. అన్ని కార్యాలయాల్లోని అధికారులు తమ సమీపంలోని చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలోని 529 ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నంద్యాల పట్టణంలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డులో ఆరు ఎకరాల్లో 500 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.