
కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం
బేతంచెర్ల: కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతులకు అన్యాయం చేస్తుందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సకాలంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇవ్వకపోగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. శుక్రవారం మండల పరిధిలోని యంబాయి గ్రామంలో రైతు శాలిమియా ఆరబోసిన ఉల్లి పంటను బుగ్గన పరిశీలించారు. నాలుగు ఎకరాల్లో రూ. 2లక్షల దాక ఖర్చు చేసి ఉల్లి పంటను సాగు చేశానని, పంట పండింది కాని ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడంతో రూ. 50 వేలు కూడా రావని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉల్లి పంట క్వింటా రూ. 500 అడుగుతున్నారన్నారు. ఉల్లితో పాటు టమాట, మిరప పంటలకు కూడ ధర లేదని రైతులు బుగ్గనకు విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో సకాలంలో విత్తనాలు, ఎరువులు, యూరియా రైతులకు అందుబాటులో ఉంచడమే కాకుండా పండిన పంటలకు మద్దతు ధర కల్పించామన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనలో పంటల మద్దతు ధర కోసం, యూరియా కోసం రైతులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకపోతే కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుందని బుగ్గన హెచ్చరించారు.