
కుటుంబాన్ని మట్టుబెట్టే యత్నం!
● పెద్ద కొట్టాలలో ఇరు కుటుంబాల ఘర్షణ ● ఇంటిలో పెట్రోల్ పోసి నిప్పంటించి గడియ పెట్టిన వైనం ● సకాలంలో పోలీసుల రాకతో స్వల్ప గాయాలతో బయటపడిన బాధితులు
నంద్యాల(అర్బన్): పెద్దకొట్టాల గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఓ కుటుంబాన్ని ఇంటిలో పెట్టి నిప్పంటించి మట్టుబెట్టే యత్నం చేయగా పోలీసుల రాకతో ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండి చిన్నబాబు, సంటెన్నలు కొత్త కాలనీలో నివాసం ఉంటున్నారు. మూడు మాసాల క్రితం తన ఇంటి వద్దకు వచ్చాడని సంటెన్న, తదితరులు చిన్నబాబు కుటుంబంపై దాడి చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో చిన్నబాబు కొంత కాలం పాటు గ్రామాన్ని వదలి వెళ్లాలని తీర్పు ఇచ్చారు. నందికొట్కూరు సమీపంలో జీవనం సాగిస్తున్న చిన్నబాబుకు ఇటీవల కుమార్తె జన్మించింది. పాప బర్త్‌డేను పెద్దకొట్టాలలో బంధువుల సమక్షంలో నిర్వహించుకోవాలని చిన్నబాబు గ్రామంలో ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం బంధుమిత్రులు వేడుకలకు హాజర య్యారు. కాగా తన ఇంటి ముందు వెళ్తున్న చిన్నబాబును సంటెన్న వర్గీయులు ఎగతాళి చేశారని, కోపోద్రిక్తుడైన చిన్నబాబు వారితో ఘర్షణకు దిగారు. అనంతరం రాత్రి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సంటెన్న వర్గీయులు చిన్నబాబు ఇంటిపై దాడికి దిగారు. ఘర్షణ తీవ్రతరం కావడంతో చిన్నబాబు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో సంటెన్న వర్గీయులు చిన్నబాబు ఇంటిలో పెట్రోల్ పోసి నిప్పటించడమే కాకుండా ఇంట్లో ఉన్న వారు ఎవరూ బయటకు రాకుండా గడియపెట్టారు. కేకలు వేస్తున్న సమీపంలో ప్రజలు భయంతో అక్కడికి రాలేకపోయారు.
సకాలంలో పోలీసులు రంగప్రవేశం
అప్పటికే గ్రామంలో ఘర్షణ జరుగుతుందనే సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇల్లు తగలబడి పోతుండటాన్ని గమనించి తలుపులు తెరిచారు. లోపల మంటల్లో చిక్కుకొని ఉన్న చిన్నబాబు చిన్నమ్మ లక్ష్మీదేవి, సామన్నతో పాటు చిన్నారులు సామేల్ రాజు, కీర్తనలు పరుగుపరుగున బయటకు వచ్చారు. అప్పటికే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పినా ఇల్లు పూర్తిగా కాలిపోయి చిన్నబాబు కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. కుమార్తె బర్త్‌డేను ఘనంగా జరుపుకోవాల్సిన సమయంలో దాడి చేసుకోవడంతో అందరూ భయాందోళనకు గురయ్యాడరు. డెకరేషన్ సామగ్రి మొత్తం దగ్ధమైంది. సంటెన్న, చిన్నబాబు పరస్పర ఫిర్యాదు మేరకు ఇరువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ఈశ్వరయ్య శుక్రవారం తెలిపారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలో చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

కుటుంబాన్ని మట్టుబెట్టే యత్నం!

కుటుంబాన్ని మట్టుబెట్టే యత్నం!