
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి
● ఏపీ పవర్ జేఏసీ కర్నూలు జిల్లా చైర్మన్ ఎస్.సతీష్‌కుమార్
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఏపీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కర్నూలు జిల్లా చైర్మన్ ఎస్.సతీష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 15 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న జేఏసీ శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఇందులో 50 మందికిపైగా పాల్గొన్నారు. రిలే దీక్షలకు పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ సంస్థల అభివృద్ధిలో శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరంతర శ్రమ ఉందన్నారు. చాలీచాలని వేతనాలతో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రాణాలను ఫణంగా పెట్టి విద్యుత్ సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. డిమాండ్‌లను సాధించుకునేందుకు ఏర్పాటైన జేఏసీలో 1104, 327, డిప్లోమ ఇంజనీర్స్, బీసీ, ఓసీ, బహుజన ఉద్యోగ సంఘాలు మొత్తంగా 23 సంఘాలు ఉన్నా యని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని, 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చే శారు. వివిధ విద్యుత్ ఉద్యోగుల సంఘాల నాయకులు మునిస్వామి, గురుమూర్తి, మధుకృష్ణ, రమణ, మల్లికార్జున, ఈ. శ్రీనివాసులు, సుందరయ్య, యల్లప్ప, కె.సత్యం తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దులో రాకపోకలు బంద్
హాలహర్వి: జిల్లా సరిహద్దులో రాకపోకలు బంద్ అయ్యాయి. హాలహర్వి మండలంలోని చింతకుంట వద్ద కట్రవంక వంతెనపై లారీ ఇరుక్కుపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ వంతెన కూలిపోవడంతో చింతకుంట గ్రామస్తులు మట్టిని వేసి చదును చేశారు. శుక్రవారం ఉదయం బళ్లారి నుంచి కర్నూలు వైపు వస్తున్న లారీ ఈ మట్టిలో దిగబడింది. దీంతో రాకపోకలు నిలిచిపోయి ప్ర యాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రైవేట్ బస్సుకు భారీ జరిమానా
కృష్ణగిరి: రోడ్ ట్యాక్స్ లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ బస్సుకు రూ. 4,43,000 జరిమానా విధించినట్లు డోన్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) క్రాంతికుమార్ తెలిపారు. కృష్ణగిరి మండల పరిధిలోని అమకతాడు సమీపాన జాతీయ రహదారిలోని టోల్‌గేట్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన బాలాజీ క్యాబ్స్ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు తమిళనాడులోని శేలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఆపారు. రోడ్ ట్యాక్స్ లేకుండా ఏపీలో తిరుగుతున్నట్లు గుర్తించి రూ. 4,43,000ల జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా పత్రాలు లేకుండా తిరిగితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి