
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట
కర్నూలు(సెంట్రల్): తమ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో అక్టోబర్ నుంచి సమ్మెలోకి వెళ్తామని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు భాస్కరరెడ్డి, శివప్రసాదు, రవి యాదవ్, మగ్బుల్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి చేపట్టిన ఆందోళనల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి ఆమె కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను సర్వే పేరుతో క్షేత్ర స్థాయికి పంపి అవమానాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ చదువుకు విలువ ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సేవలను తమతో చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా ఇంటింటికీ తిరిగే సర్వేలకు దూరంగా ఉంచాలని కోరారు. తమను తమ శాఖల మాతృసంస్థలకు అప్పగించాలని, సమయపాలన పాటించేలా విధంగా చర్యలు తీసుకొని పని ఒత్తిడి లేకుండా చూడాలని కోరారు. ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్‌లో పనిచేసిన వారికి ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంటు ఇవ్వాలని, నోషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, తమకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించాలని, అన్ని విభాగాల మాదిరిగా పదోన్నతులు కల్పించాలని, స్టేషన్ సినియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరారు.