
టీడీపీ ర్యాలీకి పోలీసు హా‘రన్’!
డోన్: సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులు కూటమి నేతల సేవలో మాత్రం నిత్యం తరిస్తున్నారు. ఆయన ప్రజాప్రతినిధి కాదు.. ఉన్నతాధికారి అంత కన్నా కాదు.. ఆయనకు బందోబస్తు అంటూ పోలీసులు చేసిన నిర్వాకం చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి డోన్, ప్యాపిలి పట్టణాల్లో పర్యటించగా, పోలీసులు చేసిన హడావుడి, హంగామా అంతా ఇంతా కాదు. యువరాజు వెడలే.. అన్న చందంగా ప్రొటోకాల్ నిబంధనలను పక్కన పెట్టేసి రాఘవేంద్రారెడ్డి కాన్వాయ్ ముందు హారన్ మోగిస్తూ పోలీసులు వెళ్లడం చూసిన ప్రజలు.. ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై పోలీసు అధికారులను సంప్రదించగా.. కోట్ల రాఘవేంద్రారెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుచూపుతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెబుతుండటం గమనార్హం.