
మోసగించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య
బేతంచెర్ల: ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక విస్మరించి ప్రజలను మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీ కృష్ణతో కలిసి పార్టీ నాయకులతో సమీక్షించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీరు సక్రమంగా వస్తుందా, నీటి సమస్య ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఎవ్వరి సిఫారసు లేకుండా కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైతే చాలు సంక్షేమ పథకాలు వర్తించాయన్నారు. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేటికీ ఒక్క కొత్త పింఛను ఇవ్వలేకపోయిందన్నారు. పైగా ఉన్న పింఛన్లనే తొలగిస్తూ ఎంతో మంది ఉసురు పోసుకుంటోందన్నారు. టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ అక్రమాలు, దందాలకు పాల్పడుతూ ప్రతి పనికీ రేటు కట్టి దోచుకుంటున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమయ్యాయని సభలు నిర్వహించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.