
అతివల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● ముగిసిన స్వస్త్ నారీ సశక్త్
పరివాన్ కార్యక్రమం
● జిల్లావ్యాప్తంగా 5,212 మంది మహిళలకు వైద్య పరీక్షలు
● వ్యాధి నిర్ధారణతోపాటు చికిత్స, ఉచితంగా మందుల పంపిణీ
జీవనశైలిపై సూచనలు..
మహిళలను ఆరోగ్యవంతులుగా ఉంచడం కోసం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాలలో వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి సూచనలు చేశారు. ఉద్యోగాలకు వెళ్లే మహిళలతోపాటు పిల్లలు జంక్ ఫుడ్‌కు అలవాటు పడి ఊబకాయంతోపాటు అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారని, నిత్యావసర వస్తువుల్లో వంట నూనెలను తగ్గించి.. స్థానికంగా లభించే ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయాలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు, జీవనశైలి దృష్ట్యా మహిళలు ఎక్కువ సమయం ఉద్యోగాలతోపాటు కుటుంబానికి తమ సమయం కేటాయిస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. ఇందులో భాగంగా గత నెల 17 నుంచి ఈ నెల 2 వరకు జిల్లాలోని 27 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, 2 బస్తీ దవాఖానాలు, జనరల్ ఆస్పత్రి పరిధిలో 85 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలకు ఉన్న ఆరోగ్య సమస్యలను గుర్తించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాలలో 5,212 మంది మహిళలకు ప్రత్యేక వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించగా అనీమియా సమస్యతో 1,013 మంది బాధపడుతున్నట్లు గుర్తించారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి 107 మంది అనుమానితులను గుర్తించి 30 మందిని వైద్య పరీక్షలకు రెఫర్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధించి 124 మంది అనుమానితులను గుర్తించి 48 మందిని వైద్య పరీక్షలకు, ఓరల్ క్యాన్సర్‌కు సంబంధించి 56 మంది అనుమానితులను గుర్తించి 12 మందిని రెఫర్ చేశారు. అలాగే టీబీకి సంబంధించి 3,160 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా 413 మందివి కళ్లె పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. 2,091 మందికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.
స్క్రీనింగ్ పరీక్షలు సైతం..
మహిళలకు నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాలలో వ్యాధులను నిర్ధారించేందుకు రక్త నమూనాలను సేకరించి టీ హబ్‌కు పంపించి పరీక్షలు చేయించారు. అవసరం ఉన్న వారికి ప్రత్యేక చికిత్స అందించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కాగా.. ఆయా వైద్య శిబిరాలలో మహిళలకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలతోపాటు చెవి, ముక్కు, గొంతు, కళ్లు, దంత సమస్యలు, రక్తపోటు, డయాబెటిస్ సమస్యలు ఉన్న వారికి చికిత్స అందించారు.
వైద్యులను సంప్రదించాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. ఈ క్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ ద్వారా 85 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి 5,212 మంది మహిళలకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి.. అవసరమైన వారికి చికిత్స అందించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేశాం. జిల్లాలోని మహిళలు అనారోగ్యాల బారిన పడితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందాలి. – రవికుమార్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ

అతివల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ