
‘ధన్– ధాన్య కృషి’ యోజనతో రైతులకు మేలు
నాగర్‌కర్నూల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించే ధన్– ధాన్య కృషి యోజన కార్యక్రమానికి పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని ప్రధానమంత్రి ధన్– ధాన్య కృషి యోజన పథకానికి ఎంపిక చేసిన నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, జనగాం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయాధికారులతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దివేస్ చతుర్వేది వీసీ నిర్వహించి.. విధివిధానాలను వివరించారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా వ్యవసాయ, మత్స్య, ఇరిగేషన్, హార్టికల్చర్, మార్కెటింగ్, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జిల్లాను రాష్ట్రం, దేశంలో మోడల్ జిల్లాగా నిలపాలని సూచించారు. ఈ పథకం కింద రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు చేపట్టడం, నీటివనరుల సమర్థ వినియోగం, మత్స్య, పశుసంవర్ధక రంగాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. ప్రతి శాఖ తమ భాగస్వామ్య బాధ్యతను గుర్తించి, సమన్వయంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఈ కార్యక్రమం అమలులో అగ్రగామిగా నిలిస్తే, రైతులకు శాశ్వతమైన ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి దిశగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్‌రావు, ఉద్యాన అధికారి వెంకటేశం, నీటిపారుదల అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు.