
విద్యార్థులు ఇష్టంతో చదవాలి : డీఈఓ
తెలకపల్లి: విద్యార్థులు ఇష్టంతో చదవాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని అనంతసాగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, వంటగదులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ప్రణాళిక బద్ధంగా ఏకాగ్రతతో చదవాలన్నారు. చదువుపై దృష్టి కేంద్రీకరించాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినాలని సూచించారు. ప్రతి విద్యార్థి కూడా అన్ని సబ్జెక్టులలో మక్కువ పెంచుకొని ఉదయం, సాయంత్రం క్రమశిక్షణతో చదవాలని అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందించాలని, సమయపాలన పాటించాలని ప్రతి విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. వారికి నాణ్యమైన విద్యతోపాటు పరిశుభ్రమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం అందించాలన్నారు.
ఆర్టీసీ లక్కీ డ్రాకు విశేష స్పందన
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ లక్కీడ్రాకు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన లభించిందని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. గత నెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) ప్రయాణించే వారికి లక్కీడ్రా నిర్వహించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్‌టీఓ రఘుకుమార్ చేతుల మీదుగా లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. ప్రథమ శివశంకర్, ద్వితీయ బిందు, తృతీయ మోక్షజ్ఞలు నిలవగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్‌గా నిలుస్తున్నదన్నారు. దసరా పండుగ రోజుల్లో ఉమ్మడి జిల్లా ప్రయాణికులు ఆర్టీసీని ఎంతో ఆదరించారని తెలిపారు. మహబూబ్‌నగర్ రీజియన్‌లోని ప్రధాన బస్టాండ్లలో ఏర్పాటు చేసిన 17 బాక్సుల్లో లక్కీడ్రా తీసినట్లు చెప్పారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో బుధవా రం ఉల్లి వేలం జోరుగా సాగింది. రెండు వారాలుగా మార్కెట్‌కు సెలవుల కారణంగా ఉల్లి వేలం నిర్వహించలేదు. ఈ వారం ఉల్లి వేలం దాదాపు వేయి బస్తాల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. వేలంలో ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1,950 ధర పలికింది. రెండు వారాల క్రితం కంటే రూ.250 ఎక్కువ ధర వచ్చింది. కనిష్టంగా రూ.1,000 వరకు పలికింది.

విద్యార్థులు ఇష్టంతో చదవాలి : డీఈఓ