
న్యాయ సేవలను వినియోగించుకోండి
కల్వకుర్తి టౌన్: ప్రజలందరూ కోర్టుల ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, జడ్జి నసీం సుల్తానా అన్నారు. బుధవారం పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓల్డేజ్ హోం, సబ్‌జైలును ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓల్డేజ్ హోంలో ఉన్న వృద్ధులతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వారికి వండిన ఆహారాన్ని పరిశీలించి.. అక్కడ కల్పిస్తున్న వసతుల వివరాలను అడిగి తెలుసుకొని ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. వృద్ధాప్యం జీవితంలో చివరి అంకం అని, వృద్ధుల చేత హుషారుగా ఉంటూ వారి చేత పాటలు పాడించి ఉత్తేజపరిచారు. అనంతరం పట్టణంలోని కోర్టు ఆవరణలో ఉన్న సబ్‌జైలును పరిశీలించి, ఖైదీలతో స్వయంగా మా ట్లాడి బాగోగులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఖైదీలకు భోజనం వడ్డించాలని జైలు సూపరింటెండెంట్‌కు సూచించడంతోపాటు వంటగది, బాత్రూంలు, ఖైదీలు ఉంటున్న గ దులను పరిశీలించారు. ఎవరైనా ఖైదీలు న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే సంస్థ తరపు న న్యాయవాదిని నియమిస్తామన్నారు. అనంతరం వృద్ధాశ్రమంతోపాటు సబ్‌జైలులో ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి సబ్‌జైలర్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఓల్డేజ్ నిర్వాహకుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

న్యాయ సేవలను వినియోగించుకోండి