
స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా అమలుపై ఆశావహుల్లో టెన్షన్
ఈ నెల 8 తర్వాతే అభ్యర్థుల ప్రకటన..
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడినా రిజర్వేషన్ల అమలుపైనే సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సైతం ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించింది. అయితే బీసీ కోటా రిజర్వేషన్ల అమలుపై ఈ నెల 8న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది.
కొనసాగుతాయా.. మారుతాయా?
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్ స్థానాలు పెరిగాయి. జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం కూడా బీసీ మహిళకు రిజర్వు కాగా.. జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో 8 చొప్పున బీసీ వర్గాలకు రిజర్వు అయ్యాయి. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు స్థానాలు గణనీయంగా పెరిగాయి. అయితే రిజర్వేషన్ల కోటా అంశంపై ఈ నెల 8న హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా.. ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లు అమలు అవుతాయా, లేదా అన్న సందిగ్ధం కొనసాగుతోంది.
కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
ఇప్పటికే పార్టీ టికెట్ దక్కించుకునే పనిలో నిమగ్నమైన ఆశావహులు
కోర్టు తీర్పు తర్వాతే జెడ్పీటీసీ,
ఎంపీటీసీ అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 9 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 11 వరకు నామినేషన్ల సమర్పణకు తుది గడువు ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటికే ఆయా స్థానాల్లో పోటీలో ఉన్న ఆశావహుల జాబితా అధిష్టానం వద్దకు చేరింది. అయితే రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్ ఉండటం, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రధాన పార్టీల్లోనూ నెలకొంది. కోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు కొనసాగుతాయా.. లేక మారుతాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 8 తర్వాతే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థిత్వాలపై నిర్ణయం తీసుకోనున్నాయి.