
రాయితీ విత్తనాల కోసం రైతుల ఆందోళన
లింగాల: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం ద్వారా అర్హులందరికీ వందశాతం రాయితీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం లింగాల పీఏసీఎస్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అంబట్‌పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ.. ఎన్‌ఎంఈఓ పథకం కింద కేంద్రం మండలానికి 1200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను కేటాయించిందని.. రైతులు రూ. 2వేల చొప్పున చెల్లించి సభ్యత్వం తీసుకుంటే 2 క్వింటాళ్ల చొప్పున పంపిణీ చేస్తామని పీఏసీఎస్ వారు చెప్పడం జరిగిందన్నారు. తీరా సభ్యత్వాలు తీసుకున్న రైతులకు క్వింటా లేదా క్వింటాన్నర మాత్రమే విత్తనాలు అందిస్తామని అంటున్నారని వాపోయారు. పీఏసీఎస్ పరిధిలో 600 మందికి మించి సభ్యత్వాలు ఇచ్చి.. వందశాతం రాయితీతో అందించే వేరుశనగ విత్తనాలను తగ్గించి ఇవ్వడమేమిటని వారు ప్రశ్నించారు. అదే విధంగా మండలానికి రెండు రకాల విత్తనాలను సరఫరా చేయగా.. అందులో ఒక రకం విత్తనాల కాలపరిమితి పూర్తయిందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. నిబంధనల మేరకు అర్హులైన రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఈఓ పాండు స్పందిస్తూ.. వాస్తవంగా 600 మంది రైతులకు 2 క్వింటాళ్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉందని, కాని సభ్యత్వాలు తీసుకున్న వారు ఎక్కువ కావడంతో అధికారుల సూచన మేరకు కోటాను తగ్గించడం జరిగిందని తెలిపారు.