
బాధితులకు అండగా నిలవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: భరోసా కేంద్రాన్ని సంప్రదించే బాధితులకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించాలని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని భరోసా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో అందిస్తున్న సేవలపై ఆరా తీయడంతో పాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల తరఫున సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు త్వరగా న్యాయం అందేలా చూడాలని సూచించారు. ఆయన వెంట భరోసా కేంద్రం ఎస్‌ఐ వీణారెడ్డి పాల్గొన్నారు.
● మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు గురైనా, మహిళలు పనిచేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా, బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు అండగా నిలిచి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేధింపులకు గురయ్యే వారు 87126 57676 నంబర్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గత సెప్టెంబర్‌లో మొత్తం 8 ఫిర్యాదులు అందగా.. ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఒక పెట్టికేసు నమోదు చేశామని, ఆరుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు టీసేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.