
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
మన్ననూర్: అడవులు, వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎఫ్‌డీఓ రామ్మూర్తి అన్నారు. 71వ ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం మన్ననూర్ ఎఫ్‌డీఓ కార్యాలయం నుంచి దుర్వాసుల చెరువు చెక్‌పోస్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారితో పాటు అటవీ పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు వేయరాదని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించి.. వారిలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో మన్ననూర్, అమ్రాబాద్, మద్దిమడుగు రేంజర్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.