మార్కెట్ల నిర్మాణమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

మార్కెట్ల నిర్మాణమెప్పుడో?

Oct 5 2025 12:16 PM | Updated on Oct 5 2025 12:16 PM

మార్కెట్ల నిర్మాణమెప్పుడో?

మార్కెట్ల నిర్మాణమెప్పుడో?

అనువైన స్థలాన్ని గుర్తిస్తాం

రైతులకు ఇక్కట్లు..

జిల్లాలో ఏళ్ల తరబడి కాలయాపన

కొల్లాపూర్‌: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వారాంతపు సంతలు నేటికీ రోడ్లపైనే సాగుతున్నాయి. మున్సిపాలిటీల్లో కల్పించే మౌలిక సదుపాయాల్లో భాగమైన ఇంటిగ్రేటెడ్‌ మోడ్రన్‌ మార్కెట్లకు ప్రజలు నోచుకోవడం లేదు. మార్కెట్ల నిర్మాణాల కోసం గతంలోనే మున్సిపల్‌, మార్కెటింగ్‌ శాఖల ద్వారా నిధులు మంజూరయ్యాయి. నిర్మాణాల కోసం స్థలాలను సైతం గుర్తించారు. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోగా.. కొల్లాపూర్‌, అచ్చంపేట మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కొన్నేళ్లుగా మార్కెట్ల నిర్మాణం ప్రకటనలకే పరిమితమవుతోంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లోనూ మోడ్రన్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు లేవు. జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో గతంలో రైతుబజార్‌ నిర్మించగా.. కొంతకాలం మాత్రమే పూర్తిస్థాయిలో కూరగాయల విక్రయాలు సాగాయి. ఆ తర్వాత దీన్ని నాన్‌వెజ్‌ మార్కెట్‌గా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా వ్యవసాయ మార్కెట్‌యార్డులో మూడెకరాల స్థలంలో మోడ్రన్‌ మార్కెట్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. మార్కెట్‌ నిర్మాణానికి మార్కెటింగ్‌ శాఖ రూ. 7కోట్లు కేటాయించింది. చాలాకాలంగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

● కొల్లాపూర్‌లో మోడ్రన్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం 2018లో టీఎఫ్‌యూఐడీసీ ద్వారా రూ. 2కోట్లు కేటాయించారు. అప్పట్లో మార్కెట్‌ నిర్మాణానికి ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి వెనకభాగంలో ఉన్న స్థలాన్ని గుర్తించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. తర్వాతి కాలంలో ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడే మార్కెట్‌ నిర్మాణానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భూమిపూజ చేయాలని భావించారు. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ఎన్నికల తర్వాత కూడా మున్సిపల్‌ అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు.

● అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో కూరగాయల మార్కెట్‌ నిర్మించేందుకు మొదట స్థలాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇరిగేషన్‌ కార్యాలయ ప్రాంగణంలోకి దాన్ని మార్చారు. రూ. 2.5కోట్లు మార్కెట్‌ నిర్మాణానికి మంజూరు కాగా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

● కల్వకుర్తి మున్సిపాలిటీలో పనులు ప్రారంభమై అసంపూర్తిగా మిగిలాయి. హైదరాబాద్‌కు వెళ్లే దారిలో గల మార్కెట్‌యార్డు స్థలంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో నిర్మాణాలు ప్రారంభించారు. పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

రోడ్లపైనే సాగుతున్న సంతలు..

నియోజకవర్గ కేంద్రాల్లో రైతు మార్కెట్లు లేకపోవడంతో సంతలు ప్రధాన రోడ్లపైనే సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్‌లో ప్రతి శుక్రవారం జెడ్పీ హైస్కూల్‌ మైదానంలో సంత సాగుతుండగా.. మిగతా రోజుల్లో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు కొనసాగుతున్నాయి. కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాల్లో ప్రతి ఆదివారం సంతలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలతో పాటు ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చిరు వ్యాపారులు, రైతులు రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. రోడ్లపై సంతలు సాగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

కొల్లాపూర్‌లో ఇంటిగ్రేటెడ్‌ మోడ్రన్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తిస్తాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి సమీపం లేదా ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో మార్కెట్‌ నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించారు. అయితే ఆ స్థలాలు మార్కెట్‌ నిర్మాణానికి అనువుగా ఉంటుందా లేదా అనే అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఈ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చర్చించారు. అనువైన స్థలాన్ని గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. ఈ దిశగా చర్యలు చేపడుతున్నాం.

– చంద్రశేఖర్‌రావు,

మున్సిపల్‌ కమిషనర్‌, కొల్లాపూర్‌

నాలుగు మున్సిపాలిటీల్లో నిర్మాణాలకు నోచుకోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు

గతంలోనే నిధులు మంజూరుచేసిన మున్సిపల్‌, మార్కెటింగ్‌ శాఖలు

స్థలాల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి

జిల్లాలో నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో కూరగాయల సాగు పెరిగింది. అయితే రైతులు పండించిన పంట విక్రయానికి మార్కెట్లు అందుబాటులో లేకపోవడంతో.. చేసేది లేక అరకొర మొత్తానికి దళారులకు అమ్ముతున్నారు. కొందరు రోజువారీగా సంతలు జరిగే ప్రాంతాలకు తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో మార్కెట్లు నిర్మిస్తే రైతులు పండించే కూరగాయలను స్థానికంగానే అమ్ముకునేందుకు వీలు కలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement