
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
అచ్చంపేట/అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం అచ్చంపేట అంబేడ్కర్ ప్రజా భవన్‌లో ఉప్పునుంతల, అమ్రాబాద్ మండలాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే వారికే అవకాశాలు దక్కుతాయన్నారు. పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని, రిజర్వేషన్లపై అపోహాలు నమ్మొద్దన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల కోసం ప్రతి మండలం నుంచి 9నుంచి 12మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక ఎన్నికలపై రాజకీయ పరిజ్ఞానం లేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. సమావేశంలో ఉప్పునుంతల మండల అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, నాయకులు తిప్పర్తి నర్సింహారెడ్డి, వేముల నర్సింహారావు, అనంత ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.