అడుగడుగునా కబ్జాలే | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా కబ్జాలే

Oct 4 2025 8:09 AM | Updated on Oct 4 2025 8:09 AM

అడుగడుగునా కబ్జాలే

అడుగడుగునా కబ్జాలే

మల్లంకుంటలో ఎఫ్‌టీఎల్‌,బఫర్‌ జోన్‌లో వెలిసిన అక్రమ నిర్మాణాలు

మల్లంకుంటను పరిరక్షిస్తాం..

ఇరిగేషన్‌ శాఖ నుంచి ఎలాంటి ఎన్‌ఓసీ ఇవ్వలేదు. మేము ఇచ్చిన నివేదిక ఆధారంగానే అక్రమ కట్టడాలను గుర్తించి మున్సిపల్‌ అధికారులు గతంలో కొన్ని దుకాణాలు కూల్చివేశారు. మున్సిపల్‌ శాఖ సహకారంతో మల్లంకుంటను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అవసరమైతే రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ గుర్తించి.. శిఖం భూమిని సర్వే చేయిస్తాం. – బాలస్వామి,

డీఈ ఇరిగేషన్‌ శాఖ, అచ్చంపేట

అచ్చంపేట: చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు మాత్రమే కాదు.. శిఖం భూములు, నాలాలూ (కాల్వలు) సైతం కబ్జా చేసి అమ్మేశారు. దీంతో ఇప్పటికే పలు చెరువులు, వాగులు ఆనవాళ్లు కోల్పోయి అందులో భవనాలు వెలిశాయి. దీంతో వరద నీరు చెరువుల్లోకి వచ్చే మార్గం లేక కుంటలుగా మారడం, ఇళ్లలోకి చేరడం జరుగుతుంది. మరోవైపు గొలుసు కట్టు చెరువులకు కూడా నీరు వెళ్లే మార్గం లేక చిన్నపాటి వర్షం వచ్చినా వరద పోటెత్తుతోంది. జిల్లాలో ఒకప్పుడు అపారమైన నీటి వనరులతో జీవకళ ఉట్టిపడిన చెరువులు నేడు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఈ కబ్జాల వ్యవహారంలో తప్పెవరిది అంటే ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా పాలకులు, అధికారులు, పేదలు, పెద్దలు అందరికీ భాగముంది. రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే చెరువుల స్థలాలో అక్రమ లే అవుట్లు చేసినా.. అనుమతి లేని నిర్మాణాలు చేపట్టినా పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో రికార్డుల్లో ఉన్న చెరువులు క్షేత్రస్థాయిలో కనుమరుగయ్యాయి.

కుచించుకుపోయిన మల్లంకుంట..

అచ్చంపేట పట్టణం మధ్యలో 28 ఎకరాల్లో మల్లంకుంట విస్తరించి ఉన్నట్లు పాత లెక్కలు చెబుతుండగా పంచాయతీరాజ్‌ నుంచి ఇరిగేషన్‌ శాఖకు బదిలీ చేసిన లెక్కల ప్రకారం 16.20 ఎకరాలు మాత్రమే ఉంది. ఇందులో 6.20 ఎకరాల శిఖం భూమి, సర్వే నం.152లో 14.6 ఎకరాల్లో 11 ఎకరాల భూమి ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉండగా రెవెన్యూ అధికారులు మాత్రం దీనిని నాన్‌ అగ్రికల్చర్‌ భూమిగా మార్చారు. ప్రస్తుతం మల్లకుంట చుట్టపక్కల వ్యాపార సమూదాయాలు, నివాస భవనాలు వెలిశాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు లోతట్టు ఇళ్లు జలమయమయ్యాయి. ఈ కుంట కబ్జా కోరల్లో చిక్కుకున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు.

ఆనవాళ్లు లేని గజవానికుంట

అచ్చంపేట మున్సిపాలిటీలో ప్రధానంగా రెండు గొలుసు కట్టు చెరువులైన గజవానికుంట, కొర్లకుంట చెరువు మాయం కావడంతో కాలనీలు జలమయమవుతున్నాయి. సాగునీటి అవసరాలు తీర్చిన ఈ రెండు చెరువులు పట్టణీకరణ నేపథ్యంలో ఆక్రమణకు గురై ఉనికి కోల్పోయాయి. అచ్చంపేట– ఉప్పునుంతల రోడ్డులోని గజవానికుంట ధ్వంసంపై అప్పట్లో పోలీసు కేసు నమోదు చేసి కొంతమందిని జైలుకు పంపించారు. ఇప్పుడు ఈ చెరువులో పెద్దపెద్ద కాలనీలు వెలసి వందలాది కుటుంబాలు నివాసం ఉటున్నాయి.

శిఖం భూమి.. అన్యాక్రాంతం

కొర్లకుంట శిఖం భూమి ప్లాట్లు చేసి అమ్మేశారు. పట్టణంలోని గజవానికుంట కింద గొలుసు కట్టు కింద ఉన్న కొర్లకుంట సర్వే నం.351లో రెండున్నర ఎకరాల శిఖం భూమి ఉండగా సుమారు ఎకరం భూమి అన్యాక్రాంతమైంది. శిఖం భూమి ఇతర అవపరాలకు కేటాయించడానికి కూడా వీలు లేదు. ఇలాంటి స్థలం పరిరక్షించాల్సిన బాద్యత రెవెన్యూశాఖపై ఉన్న పట్టింపు లేని ధోరణితో వ్యవహరిస్తున్నారు.

మాయమైన ఎర్రకుంట..

ఎర్రకుంటను రియల్టర్‌ ఏకంగా కూల్చివేస్తున్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపంతో కబ్జాదారులు రెచ్చిపోయారు. జన్మభూమి కార్యక్రమంలో పనికి ఆహార పథకం కింద తుమ్మలకుంటకు వెళ్లే నీటి ప్రవాహానికి అడ్డుగా నీటి నిల్వ కోసం అప్పట్లో ఈ కుంట ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనిని రియల్టర్లు ఆనవాళ్లు లేకుండా చేశారు.

అచ్చంపేటలో చెరువులను చెరబట్టిన అక్రమార్కులు

గొలుసుకట్టు చెరువులు, కుంటలు ధ్వంసం

నాలాలు సైతం కబ్జా కోరల్లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement