
కృష్ణమ్మ ఉగ్రరూపం
ఎర్రవల్లి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.20 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదిలారు. దీంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద తీవ్రత పెరగడం పుష్కరఘాట్లు నీట మునిగాయి. శివాలయం అతిసమీపంలో వరద ప్రవహిస్తుంది.
నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణానది పరివాహక ప్రాంతంలో, గ్రామాల్లో నివసించే ప్రజలు వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. ఆదివారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్ల వద్దకు, నీటిలోకి భక్తులు ఎవరూ వెళ్లవద్దని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అన్నారు. గొర్రెలు, పశువుల కాపరులు మేత కోసం నది సమీపంలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వెళ్లవద్దని, ముసురు వర్షాల వల్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు ఏమైనా అత్యవసరమైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీఐ రవిబాబు, ఎస్‌ఐ రవినాయక్ ఉన్నారు.
బీచుపల్లి బ్రిడ్జి వద్ద ఉధృతంగా వస్తున్న కృష్ణమ్మ

కృష్ణమ్మ ఉగ్రరూపం