
స్థానిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
నాగర్‌కర్నూల్: అధికారులు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో రానున్న స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్వోలు, ఏఆర్‌ఓలకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలతో, అధికారుల నియామకంతో పాటు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల వినియోగం తదితర వాటిపై శిక్షణ అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందని సూచించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు. పంచాయతీ రాజ్ చట్టం 2018, ఎన్నికల సంఘం హ్యాండ్‌బుక్‌లోని మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఆమోదం లేదా తిరస్కరణ వంటి దశలు అత్యంత కీలకమని, ఈ ప్రక్రియలో ఆర్వోలు జాగ్రత్త వహించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే 786 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ, మాస్టర్ ట్రెయినర్ గోపాల్‌నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.