
సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
కల్వకుర్తి టౌన్: వైద్య సిబ్బంది రోగులకు అందించే సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, వారికి అన్ని వసతులు కల్పించాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా సభ్యులు డా.సుభోద్, రామలక్ష్మి అన్నారు. శనివారం పట్టణంలోని సీహెచ్‌సీని 10 సభ్యులతో కూడిన కేంద్ర బృందం పరిశీలించింది. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్ట్స్ ప్రకారం సేవలు అందుతున్నాయా లేదా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని ఆస్పత్రి అంతా తిరిగి చూశారు. అన్ని విభాగాలను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడి వివరాలను సభ్యులు సేకరించి, నోట్ చేసుకున్నారు. 108, 102 అంబులెన్స్ సేవల గురించి ఆరా తీశారు. ఎప్పుడూ సమయానికి రాని కొందరు వైద్యులు కేంద్ర బృందం వచ్చిన సమయంలో మాత్రం ఇన్‌టైంలో రావటం ఆశ్చర్యానికి గురిచేస్తుందని సిబ్బంది మాట్లాడుకోవటం గమనార్హం.