
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
● కలెక్టర్ బదావత్ సంతోష్
● కలెక్టరేట్‌లో అంబరాన్నంటిన
బతుకమ్మ సంబరాలు
కలెక్టరేట్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలు
నాగర్‌కర్నూల్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులు, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళా ఉద్యోగులు, ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతిని, మహిళా శక్తిని గౌరవిస్తుందన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే పండుగ భక్తిశ్రద్ధలతో పాటు సామూహిక ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బతుకమ్మలో ఉపయోగించే గూనుగు పూలు, తంగెడు, బంతి, గులాబీ, తులసి వంటి పువ్వులు మహిళల భక్తిని మాత్రమే కాదని.. ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేస్తాయని అన్నారు. ప్రతి మహిళ బతుకమ్మ సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ నెల 30న జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను స్థానిక మినీ ట్యాంక్‌బండ్‌పై అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. జిల్లాలోని మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి.అమరేందర్, అడిషనల్ డీఆర్డీఓ రాజేశ్వరి, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి డా.రజిని, డీఈఓ రమేశ్‌కుమార్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్ బదావత్ సంతోష్