
కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం
లింగాల/చారకొండ/బల్మూర్: పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. గురువారం లింగాల శివారులో రూ. 3కోట్లతో గిరిజన బాలుర వసతిగృహం నిర్మాణ పనులను ప్రారంభించారు. చారకొండ మండలం సీర్సనగండ్ల, బల్మూర్ మండలం కొండనాగుల, లింగాల మండలం అంబట్‌పల్లి గ్రామాల్లో మినీ గ్రంథాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లింగాలలో ఇప్పటికే రూ. 2.30కోట్లతో ఇంటిగ్రేటెడ్ వసతిగృహం నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు. గ్రామాల్లో డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుతో కామన్ ఎంట్రెన్స్ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. సీర్సనగండ్ల దేవాలయ భూమిలో అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లు కోల్పోయిన 35 మందికి త్వరలోనే సర్వే నంబర్ 290లో ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం సీర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎంపీ, ఎమ్మె ల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, డీటీడీఓ ఫిరంగి, ఆర్డీఓ మాధవి, ఆలయ చైర్మన్ రాహశర్మ, ఈఓ ఆంజనేయులు, నాయకులు రంగినేని శ్రీనివాసరావు, నాగేశ్వర్‌రావు, వెంకట్‌గౌడ్, బాల్‌రాంగౌడ్, నర్సింహారెడ్డి, మల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, కాశన్నయాదవ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.