
ప్రతిపక్షాలవి పసలేని ఆరోపణలు
రూ.15 కోట్లు మంజూరు
కల్వకుర్తి టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని, వారు చేసే ఆరోపణల్లో ఎలాంటి పసలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను చూసి వారు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రతిపక్షాలు తీరు మార్చుకోకుంటే స్థానిక ఎన్నికల్లో భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నాయకులకు ఈ ప్రాంతం అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని హితువు పలికారు. ఉన్నత చదువులు చదువుకొని, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన వారు అసభ్య పదజాలం వాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధి కోసం నేరు ఎమ్మెల్యేలనే కలవాలని, మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే తాడూర్ మండలంలో ప్రజల వద్ద డబ్బులు తీసుకున్న మధ్యవర్తిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పేరుతో నూతన విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యుడు డా.చారకొండ వెంకటేష్ అన్నారు.
కల్వకుర్తి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నగర అభివృద్ధి పేరుతో రూ.15 కోట్లు మున్సిపల్ శాఖ నుంచి విడుదలైనట్లుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. పట్టణంలోని పాలమూరు చౌరస్తా అభివృద్ధి, ఆడిటోరియం, నూతన షాపింగ్ కాంప్లెక్స్ శివాజీ చౌక్ వద్ద నిర్మించేందుకు రూ.2 కోట్లు, డిజిటల్ లైబ్రరీ కోసం రూ.1.5 కోట్లు, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి మిగిలిన నిధులను వినియోగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా కల్వకుర్తి మండలంలో మరో మూడు నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం కోసం రూ.3.5 కోట్లు విద్యుత్ శాఖ ద్వారా మంజూరయినట్లుగా తెలియజేశారు. సమావేశంలో టీశాట్ సీఈఓ వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి
సీఎం ఎంతో చేస్తున్నారు
సంక్షేమ పథకాల లబ్ధిదారులు
దళారులను ఆశ్రయించొద్దు
ఎమ్మెల్యేలు కసిరెడ్డి, రాజేష్‌రెడ్డి