తెలకపల్లి: పోలీసులు ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు. బుధవారం తెలకపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. కానిస్టేబుళ్లు వారికి కేటాయించిన గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి, ఎప్పటికప్పుడు ఎస్‌ఐకి వివరాలు అందించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
అదనపు ఎస్పీగా వెంకటేశ్వర్లు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా అదనపు ఎస్పీగా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన రాచకొండ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తూ అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.
26న ఉద్యోగమేళా
కందనూలు: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో 26న ఉద్యోగమేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధి కారి రాఘవేందర్‌సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 50 ఉద్యోగాల భర్తీకి మేళా కొనసాగుతుందన్నారు. పదో తరగతి ఆర్హత కలిగి 25 నుంచి 32 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 95051 86201, 96669 74704 నంబర్లను సంప్రదించాలని కోరారు.
రక్తదానం ప్రాణదానం
తెలకపల్లి: రక్తదానం ప్రాణదానంతో సమానమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవికుమార్ అన్నారు. స్వస్తినారి స్వశక్తి పరివాన్ అభియాన్‌లో భాగంగా బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ, రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో సీఎల్ విదాసంస్థలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 36 యూనిట్ల రక్తం సేకరించారు. అనంతరం సీఎల్‌ఆర్ విద్యా సంస్థలో నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించారు. శిబిరంలో 460 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ కోసం 65 మందిని గుర్తించారు. సీఎల్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ రాజమహేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, రెడ్‌క్రాస్ కన్వీనర్ కుమార్, ప్రిన్సిపాల్ సందీప్‌కుమార్ పాల్గొన్నారు.
పౌష్టికాహార కిట్ల పంపిణీ
బిజినేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్థులకు బుధవారం డీఎంహెచ్‌ఓ డా.కె.రవికుమార్ పోషకాహార కిట్లను అందజేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డా. శివకుమార్, భవిష్య భారత్ ట్రస్టు స్టేట్ మేనేజర్ బాల హనుమంతు, జిల్లా మేనేజర్ అలీ, డా.పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి