
మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ చెల్లించాలి
నాగర్‌కర్నూల్: మిల్లర్లు ప్రభుత్వానికి అందించే సీఎమ్మార్ రైస్‌ను వంద శాతం అందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ పి.అమరేందర్ రైస్ మిల్లర్లతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వానాకాలం 2024–25, రబీ 2024–25 సీజన్లలో రైస్ మిల్లర్ల ద్వారా సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అందజేయడంపై, అలాగే వానాకాలం పంట 2025–26 సీజన్ ఏర్పాట్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మిల్లర్ తమ మిల్లింగ్ సామర్థ్యానికి అనుగుణంగా బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తే ధాన్యం అందిస్తామని స్పష్టం చేశారు. మిల్లర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా.. వాటిని పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, డీఎం సివిల్ సప్లై రాజేందర్ తదితరులు హాజరయ్యారు.
రెవెన్యూ వ్యవహారాలు సమర్థవంతంగా..
క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను సమవర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామంలో కొత్తగా నియమించిన గ్రామ పాలన అధికారులు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు తమ విధులపై పూర్తి అవగాహనతో ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్ అమరేందర్‌తో కలిసి నూతనంగా నియమించిన జీపీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ పి.అమరేందర్ గ్రామ పాలన అధికారులు, లైసెన్స్ సర్వేయర్లకు విధుల నిర్వహణ, రెవెన్యూ పరమైన అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా సర్వేయర్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్