
విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. బుధవారం అచ్చంపేటలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజాభవన్‌లో మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసిందన్నారు. 4ఎకరాల్లో పశువుల సంత, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, మినీ ట్యాంకుబండ్‌పై రిసార్ట్, రోడ్లు, ఉప్పునుంతల, లింగాల రోడ్లను కలుపుతూ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.8కోట్లతో రాజీవ్–ఎన్‌టీఆర్ స్టేడియం, రూ.3 కోట్లతో పట్టణంలోని సీతారాలగుట్ట వద్ద 7 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్సార్ పార్కు, రూ.3కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీ, రూ.కోటితో మున్సిపల్ భవనంపై రెండో ఫ్లోర్‌లో మెప్మా హాల్ వంటి అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. లింగాలలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్‌కు రూ.3కోట్లు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు రూ.2.30 కోట్లు, మండల పరిషత్ భవనం ఆవరణలో రూ.కోటితో స్టడీహాల్, గ్రంథాలయం భవనం, సాయినగర్ జిల్లాపరిషత్ పాఠశాలకు రూ.60లక్షలు, తిప్పారెడ్డి పాఠశాలకు రూ.50లక్షలు, అమ్రాబాద్ డిగ్రీ కళాశాలకు రూ.20 లక్షలు, జూనియర్ కళాశాలకు రూ.20 లక్షలు, మద్దిమడుగు పాఠశాలకు రూ.30 లక్షలు, లింగాల కేజీబీవీకి రూ.30 లక్షలు, మిగతా కేజీబీవీల మరమ్మతుకు రూ.4 కోట్లు మంజూరయ్యాయన్నారు. రెండేళ్ల కాలంలో 15 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, ఒక 133/33 కేవీ, అమ్రాబాద్‌లో 220 కేవీ సబ్‌స్టేషన్ మంజూరైందని తెలిపారు. తుమ్మలకుంటలో నీట మునిగిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సీతారాలగుట్టకు మార్చామని, మాజీ మంత్రి మహేంద్రనాథ్ పేరు మీద రవీంద్రభారతి, మాజీ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ పేరు మీద ఇండోర్ స్టేడియం, మాజీ ఎంపీ మల్లు అనంతరాములు పేరు మీద చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. వంకేశ్వరం, నడింపల్లి, ఐనోలు, సిరసనగండ్ల, కొండనాగుల, అంబట్‌పల్లి, ఎల్లమ్మ రంగాపూర్‌లో గ్రంథాలయాలు మంజూరైనట్లు పేర్కొన్నారు. 40 కొత్త గ్రామపంచాయతీ భవనాలు, 40 అంగన్‌వాడీ భవనాలు మంజూరయ్యాయని వెల్లడించారు. మద్దిమడుగు కృష్ణానదిపై వంతెన ఏర్పాటు, జాతీయ రహదారి మంజూరుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తామని చెప్పారు.