
భూ సేకరణే అడ్డంకి
రెండేళ్లుగా ముందుకు సాగని సింగోటం– గోపల్‌దిన్నె లింక్ కెనాల్
మంత్రి జూపల్లి సమీక్ష..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు కెనాల్ తవ్వకంపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగానే గత నెలలో కెనాల్ పనులను పునఃప్రారంభించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం కలెక్టర్ల వద్ద రూ.25 కోట్ల మేర నిధులు ఉండడంతో రైతులకు న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలని సూచించారు. దీనిపై గ్రామాల వారీగా రైతులతో మాట్లాడేందుకు మంత్రి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వెల్లడించారు.
ప్రయోజనం ఇలా..
సింగోటం– గోపల్‌దిన్నె లింకు కెనాల్‌తో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఐదు మండలాల రైతాంగానికి మేలు జరగనుంది. వీపనగండ్ల, చిన్నంబావి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లోని చివరి ఆయకట్టు పొలాలతోపాటు పాన్‌గల్ మండలంలో కొంతమేరకు సాగునీరు అందుతుంది. లింక్ కెనాల్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న 24,500 ఎకరాలు, రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వస్తుంది. అలాగే వేసవిలో గోపల్‌దిన్నె రిజర్వాయర్ కింద ఉండే పలు గ్రామాలకు తాగునీటి సమస్య కూడా తీరుతుంది.
కొల్లాపూర్: ఉమ్మడి జిల్లాలోనే వెనకబడిన కొల్లాపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందించానే లక్ష్యంతో చేపట్టిన సింగోటం– గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు ఏళ్లతరబడిగా సాగుతూనే ఉన్నాయి. భూ సేకరణ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ పనులను పూర్తి చేసేందుకు ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు పునఃప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులను గమనిస్తే ఈసారైనా పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయా.. లేదా.. అనే సంశయం నెలకొంది. ఈ కెనాల్ పూర్తయితే ఐదు మండలాల పరిధిలోని 34 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సమస్యలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు.
శాశ్వత పరిష్కారం కోసం..
జూరాల ఎడమ కాల్వ, భీమా కెనాల్ కింద చివరి ఆయకట్టు భూములు కొల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రైతులకు రబీ సీజన్‌లో రెగ్యులర్‌గా సాగునీటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సింగోటం– గోపల్‌దిన్నె లింకు కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు. 2018లో ఈ కెనాల్ నిర్మాణానికి నిధుల కేటాయింపు చేసినా.. చాలాకాలం తర్వాత 2022లో రూ.147.7 కోట్లు మంజూరు చేసింది. 2023లో ఊపందుకున్న పనులు.. తర్వాతి కాలంలో నిధుల విడుదలలో జాప్యం, భూ సేకరణ సమస్య కారణంగా నిలిచిపోయాయి.
22.5 కి.మీ., గాను ఇప్పటి వరకు 5 కి.మీ., మేరకే తవ్వకాలు
పరిహారం పెంచితేనేభూములిస్తామని రైతుల డిమాండ్
ఇటీవల మంత్రి జూపల్లి పునఃప్రారంభించినా మందకోడిగానే..
కాల్వ పూర్తయితే 34 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు