
ఇందిరమ్మలో వసూళ్ల పర్వం
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొందరు మధ్యవర్తులు చేరి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, నిర్మాణం, బిల్లుల మంజూరులో తమకు డబ్బులు ఇవ్వాలని చెబుతూ లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 10,530 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. వీటిలో 6,653 ఇళ్లకు అధికారులు మార్కింగ్ పూర్తిచేశారు. జిల్లాలో 3,738 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్‌లో ఉండగా, 559 ఇళ్లు పైకప్పు వరకు నిర్మాణంలో ఉన్నాయి. మరో 142 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా పథకాన్ని అందిస్తుండగా.. కొంతమంది మధ్యవర్తులుగా చేరి గుట్టుచప్పుడు కాకుండా అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఇక్కట్లే
జిల్లాలో పలుచోట్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక, మట్టి పేరిట కొందరు అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో ఇసుక, మట్టి పేరుతో కొందరు అక్రమంగా దందా నడిపిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. దుందుభీ వాగు నుంచి అనధికారికంగా తీసిన ఇసుకను డంపులుగా నిల్వ చేసుకుని ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ఇసుక సరఫరా సక్రమంగా లేకపోవడంతో లబ్ధిదారులు గత్యంతరం లేక ప్రైవే టు వ్యక్తుల నుంచే ఇసుక కొనుగోలు చేస్తున్నారు.
ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు దండుకుంటున్న మధ్యవర్తులు
బిల్లులు రాక, ఖర్చులు భరించలేక..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇళ్లు మంజూరైన నిరుపేద కుటుంబాలు తమ వద్ద డబ్బులు లేకపోయినా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. అయితే ఆధార్, బ్యాంక్, సెల్‌ఫోన్ నంబర్ లింకేజీ, కేవైసీ తదితర సమస్యలతో చాలామందికి మొదటి విడత డబ్బులు కూడా పడటం లేదు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఐరన్ సామగ్రి ధరలు చుక్కలు చూపుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇస్తున్న దానికన్నా మించి ఖర్చవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. దీనికితోడు బిల్లులు ఆలస్యం అవుతుండటంతో పనులు ఆగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. పను లు పూర్తయిన మేరకు బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని కోరుతున్నారు.
సిర్సవాడలో కమిటీ సభ్యుడి అక్రమ వసూళ్లు
ఓ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
‘ఉచిత’ ఇసుక, మట్టి పేరిట సైతం దోపిడి
లబ్ధిదారులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు
డబ్బులు ఇవ్వొద్దు..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణం కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తుంది. ఇందులో మధ్యవర్తులకు ప్రమేయం ఉండదు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయి.
– సంగప్ప, ఏడీ, హౌసింగ్ శాఖ