
డిజిటల్ గ్రంథాలయాలతో విజ్ఞానం పెంపు
నాగర్‌కర్నూల్: గ్రామీణ స్థాయిలో విద్యార్థులు, ప్రజలకు విజ్ఞానం పెంపొందించేందుకు, చైతన్యం కల్పించేందుకు ఎంపీ మల్లు రవి ప్రత్యేక చొరవతో జిల్లాలో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఎస్‌ఆర్ నిధులు రూ.1.20 కోట్లతో మొత్తం 50 డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాట్లు చేస్తామని, ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో 8, కొల్లాపూర్‌లో 7, అచ్చంపేటలో 7, నాగర్‌కర్నూల్‌లో 7 చొప్పున 29 డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో డిజిటల్ గ్రంథాలయాల నూతన భవనాల నిర్మాణాలు, గ్రంథాలయాల ఏర్పాట్లకు కావాల్సిన స్థల సేకరణపై జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రంథాలయాల అభివృద్ధికి స్థలాల సేకరణ, నిర్మాణాలు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు పర్యవేక్షణ చేసి పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులు సరికొత్త సాంకేతిక సదుపాయాలతో విద్యనభ్యశిస్తారని, ప్రజలు సమాజంలో చైతన్యం, విజ్ఞానం పెంపొందించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, సీఎస్‌ఆర్ నిధులు సమకూర్చే బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.