
హిందూ సమాజం ఏకం కావాలి
కందనూలు: దేశం, ధర్మం, సమాజం కోసం హిందూ సమాజం ఏకం కావాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్, వక్త కూర జయదేవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శతాబ్ధి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి విజయదశమి నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో సామరస్యంతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. శత్రుదేశాలు ఎన్నో విధాలుగా భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసినా ఐకమత్యంతో కూడిన భారతదేశం ఏనాడు కూడా శత్రుదేశాలకు తలొగ్గకుండా ముందుకు సాగడం భారతీయుల గొప్పతనం అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన నర్సిని దత్తాత్రేయులు మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తుందని, ఎక్కడ ఎలాంటి విపత్తులు సంభవించినా, శత్రుమూకలు భారత్‌ను ఇబ్బందులకు గురిచేయడానికి ప్రయత్నించినా సంఘ కార్యకర్తలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ్ చాలక్ వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నగర కార్య నిర్వాహక్ వేముల సురేష్, బస్తీ ప్రముఖ్ గోపాలకృష్ణ, ఉత్సవ ప్రముఖ్ మిడిదొడ్డి నాగరాజు, స్వయం సేవకులు పాల్గొన్నారు.