
నడినెత్తిపై ముప్పు
ప్రమాదాలు జరగకుండా
చర్యలు..
అక్రమంగానే
విద్యుత్ వినియోగం..
ప్రమాదకరంగా టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ కేబుళ్లు
● జిల్లావ్యాప్తంగా
తొలగింపునకు కసరత్తు
● ముందస్తుగా కేబుల్
ఆపరేటర్లకు హెచ్చరికలు
● ప్రమాదాల నివారణ కోసం
విద్యుత్ శాఖ చర్యలు
● ఇప్పటికే ప్రమాదకరంగా
ఉన్న తీగల తొలగింపు
అచ్చంపేట రూరల్: జిల్లాలోని నాలుగు డివిజన్ పరిధిలోని పట్టణాల్లో విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న కేబుల్ టీవీ, ఇంటర్‌నెట్, టెలిఫోన్ల వైర్లు ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం నాలుగు వరుసలతో మాత్రమే కరెంటు తీగలు ఉంటే.. ఆ స్తంభాలపై 20 నుంచి 30 వరుసలతో కూడిన కేబుల్ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలతోపాటు ఆయా ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు, వ్యాపారులు తరచూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దుమారానికి విద్యుత్ తీగలు తగిలినప్పుడు మెరుపులు వచ్చి అవి కేబుళ్ల మీద పడి మంటలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రధాన రహదారుల మీదే జరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు నిత్యం భయాందోళనలకు గురవుతున్నారు.
సమన్వయం కరువు..
జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ సంస్థల పరిధిలోనే ఉంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఎవరికి వారుగా తమకు కంపెనీకి చెందిన 10 నుంచి 20 తీగలను విద్యుత్ స్తంభాలకు వేలాడదీస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇష్టారాజ్యంగా కేబుళ్లు ఏర్పాటు చేసుకున్నారు.
అనుమతి తప్పనిసరి..
విద్యుత్ శాఖకు చెందిన స్తంభాలపై కేబుళ్లు ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ నుంచి అనుమతి కూడా తీసుకోవడం లేదు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కేబుళ్లు విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
మరమ్మతుకు తిప్పలు..
విద్యుత్ సిబ్బంది స్తంభాలను ఎక్కి మరమ్మతు చేయాల్సి వచ్చినప్పుడు కుప్పలు తెప్పలుగా ఉంటున్న కేబుల్ తీగలు అడ్డంకిగా మారుతున్నాయి. భారీ క్రేన్లను తెప్పించి కేబుళ్లు తగలకుండా పనులు చేయాల్సి వస్తోందని, అయినా ఆ సమయంలో అవి తమ క్రేన్లకు అడ్డుగా వస్తున్నాయని విద్యుత్ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. దీనికితోడు భారీ వాహనాలు వెళ్లినప్పుడు కిందకు వేలాడుతున్న కేబుళ్లు తెగి.. విద్యుత్ వైర్లకు తాకి.. మెరుపులు కూడా వస్తున్నాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే వారు కేబుళ్లు తగిలి ప్రమాదాల బారిన పడుతున్నారు.
నిబంధనలకు పాతర..
విద్యుత్ స్తంభాలకు ఇంటర్నెట్, టీవీ కేబుల్ తీగలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. తీగలను ఇష్టానుసారంగా వదిలివేయడంతో ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉందో తెలియడం లేదు. చాలాచోట్ల తీగలు నేలపై పడి ఉండటం, నడుచుకుంటూ వెళ్తుంటే తలకు తాకేలా వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం 18 అడుగుల ఎత్తుకు పైగా వీటిని ఏర్పాటు చేయాలి. కానీ, స్తంభాలకు ఇబ్బడిముబ్బడిగా ముడిపెట్టి తక్కువ ఎత్తులో తీగలు ఉంచడంతో కిందికి వేలాడుతున్నాయి. ఇవి తెగి విద్యుత్ తీగలపై పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
జిల్లాలో ఎక్కడా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కేబుల్ ఆపరేటర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చాం. 15 మీటర్ల ఎత్తులో కేబుళ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ప్రమాదకరంగా ఉన్న కేబుళ్ల తొలగించాం. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే.
– నర్సింహారెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ
ఇంటర్నెట్, కేబుల్ తీగలు వేయడానికి స్తంభాలను ఉపయోగించినప్పుడు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి. ఒక్కో స్తంభానికి గ్రామీణ ప్రాంతంలో రూ.15, పట్టణాల్లో రూ.20 చెల్లించాలి. కానీ, ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కేబుల్ తీగలకు కావాల్సిన విద్యుత్‌ను అక్రమంగానే వినియోగిస్తున్నారు. అక్రమంగా విద్యుత్ వినియోగంతో టీవీలకు వచ్చే కేబుల్ వైర్లకు ఒక్కోసారి విద్యుత్ సరఫరా జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ చూసినా విద్యుత్ స్తంభాల నుంచి కేబుల్, ఇంటర్నెట్ వైర్లు వేలాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జిల్లాలో జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

నడినెత్తిపై ముప్పు