
ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు
రెండు రోజుల్లోనే ప్రక్రియ..
● బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం
మార్గదర్శకాలు విడుదల
● కీలకంగా మారనున్న కేటాయింపు ప్రక్రియ
● కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓలకు
బాధ్యతల అప్పగింత
దసరా పండగ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తదే భవిష్యత్ అంటూ వారికి భరోసా కల్పిస్తోంది. ముందుగానే హామీ ఇచ్చినట్టుగా బీసీ రిజర్వేషన్ల అమలుతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం ఇప్పటికే విస్తృతంగా పార్టీ సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికీ తమ కేడర్ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. బీజేపీ సైతం రాష్ట్రస్థాయిలో సమావేశాలు నిర్వహించగా.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి.
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియపై కీలకమైన బాధ్యతలను కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులకు అప్పగించింది. రిజర్వేషన్ల ప్రక్రియపై మార్గదర్శకాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 77 జెడ్పీటీసీ, 802 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 1,705 గ్రామ పంచాయతీలు, 15,322 వార్డు స్థానాలు ఉన్నాయి.
బీసీ కులగణన ఆధారంగా..
ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఫలితంగా గత ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలతోపాటు అదనంగా మరికొన్ని స్థానాలు పెరగనున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ క్రమంలో జనరల్ కేటగిరి స్థానాలు తగ్గే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే రిజర్వేషన్ స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. షెడ్యూల్డ్, ఏజెన్సీ ఏరియాలో ఎంపీటీసీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎస్టీ జనాభాలో 50 శాతం తగ్గకుండా చూస్తారు. అలాగే ఎస్టీ నోటిఫైడ్ గ్రామాల్లో సర్పంచులు, వార్డుమెంబర్ పదవులను పూర్తిగా వారికే కేటాయించనున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల నిర్వహణపై ఆశలు నెలకొన్నాయి.
గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లను కేటాయించే బాధ్యతలను ప్రభుత్వం సంబంధిత అధికారులకు అప్పగించింది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కేవలం రెండు రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, జెడ్పీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఖరారు చేయనున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్ కేటాయించనున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను ఆర్డీఓ ఖరారు చేయనుండగా.. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా మండలాల ఎంపీడీఓలు కేటాయించనున్నారు.
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా పూర్తయ్యింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. ఓటరు జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ పూర్తి కాగా.. బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్ ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీలు స్థానాలు ఇలా..
జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ
నాగర్‌కర్నూల్ 20 214
మహబూబ్‌నగర్ 16 175
వనపర్తి 15 136
జోగుళాంబ గద్వాల 13 141
నారాయణపేట 13 136