
జగన్మాతకు జేజేలు
● వైభవంగా శరన్నవరాత్రి
ఉత్సవాలు ప్రారంభం
● జిల్లాకేంద్రంలో ఆకట్టుకున్న
విగ్రహ శోభాయాత్ర
● మొదటిరోజు నిజరూపంలో
దర్శనమిచ్చిన వాసవీమాత
కందనూలు: జగన్మాతకు జేజేలు.. పాహిమాం పరమేశ్వరీ.. దుర్గమ్మా.. కరుణించమ్మా అంటూ భక్తుల నినాదాలతో జిల్లావ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలు, కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో జగన్మాతను కొలువుదీర్చి వివిధ రూపాల్లో అలంకరించారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలో 55వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవీ కన్యకాపరమేశ్వరి ఉత్సవ విగ్రహ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. కోలాటాలు, చెక్క భజనలు, సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపు సాగింది. ఆలయ అర్చకులు జోషి పాండురంగ శర్మ ధ్వజారోహణం, గణపతి, గోపూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. మొదటిరోజు అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

జగన్మాతకు జేజేలు