
‘పాలమూరు’ నీళ్లను డిండికి తరలిస్తే ఊరుకోం
కోడేరు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నల్లగొండ జిల్లా డిండికి నీళ్లను తరలిస్తే అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నాగం శశిధర్‌రెడ్డి అన్నారు. మండలంలోని తీగలపల్లిలో జరుగతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 5– 6 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు గాను 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారన్నారు. కేవలం 2 లక్షల ఎకరాల కోసం పాలమూరు జిల్లాను ఎడారి చేయడానికి కుట్ర చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పటికే కేఎల్‌ఐ, పాలమూరు ఎత్తిపోతలు, మిషన్ భగీరథ పథకంలో దాదాపు 40 శాతం మంది రైతులు భూములు నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు నుంచి నీటిని తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు అర్థం రవి, బాలగౌడ్, శంకర్, భీముడు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.