
సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ
● జిల్లాలోని 21 పాఠశాలల్లో తరగతులు ప్రారంభం
● 80 మందికి పైగా విద్యార్థుల చేరిక
● మౌలిక వసతుల కోసం
రూ. 31.50లక్షలు కేటాయింపు
● ప్రతి పాఠశాలకు ఒక ఇన్‌స్ట్రక్టర్, ఆయా నియామకం
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు లేకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆర్థికభారం అయినప్పటికీ ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించింది. జిల్లాలోని 21 పాఠశాలల్లో 15 రోజుల క్రితం ప్రీ ప్రైమరీ తరగతులను ఆరంభించగా.. 86 మందికి పైగా విద్యార్థులు చేరారు. దీంతో సర్కారు బడులు మరింత బలోపేతం కానున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ చదివిన పిల్లలకు వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుంది. తద్వారా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఒక్కో స్కూల్‌కు రూ. 1.50లక్షలు..
పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ అభ్యసించే చిన్నారులకు ప్రత్యేక తరగతి గది ఉండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, ఆటపాటల కోసం సామగ్రి, సౌకర్యవంతమైన కాంతి, గాలి ప్రవాహం అవసరం. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఫర్నిచర్ కోసం రూ. 50వేలు, అవుట్‌డోర్, ఇండోర్ ప్లే మెటీరియల్‌కు రూ. 50వేలు, పెయింటింగ్‌కు రూ. 50వేల చొప్పున ప్రతి పాఠశాలకు రూ. 1.50లక్షలు మంజూరు చేసింది. ఇలా జిల్లాలోని 21 పాఠశాలలకు రూ. 31.50లక్షలు కేటాయించారు. త్వరలోనే టెండర్లు పిలిచి.. ఆయా పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
బోధన కోసం..
ప్రీ ప్రైమరీ తరగతుల బోధన కోసం ప్రతి పాఠశాలకు ఒక ఇన్‌స్ట్రక్టర్, ఆయాను నియమించనున్నారు. వీరిని తాత్కాలిక పద్ధతిలోనే ఎంపిక చేస్తారు. వీరు పది నెలలపాటు మాత్రమే విధులు నిర్వహిస్తారు. ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకానికి సంబంధించి డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. త్వరలోనే వీరిని నియమించే అవకాశం ఉంది.
మండలం పాఠశాల
అమ్రాబాద్ ఎంపీపీఎస్, చింతలోనిపల్లి
కల్వకుర్తి ఎంపీయూపీఎస్, ముకురాల
కోడేరు ఎంిపీపీఎస్, కొండ్రావ్‌పల్లి
కోడేరు ఎంపీపీఎస్, కోడేరు
కోడేరు ఎంపీపీఎస్, బాడుగదిన్నె
కొల్లాపూర్ ఎంపీపీఎస్, నర్సింహాపురం
కొల్లాపూర్ ఎంపీపీఎస్, నార్లాపురం
లింగాల ఎంపీపీఎస్, సూరాపూర్
లింగాల ఎంపీపీఎస్, కొత్తకుంటపల్లి
లింగాల ఎంపీపీఎస్, మగ్దూంపూర్
నాగర్‌కర్నూల్ ఎంపీయూపీఎస్, దేశిటిక్యాల
పెద్దకొత్తపల్లి ఎంపీపీఎస్, కొత్త యాపట్ల
పెంట్లవెల్లి ఎంపీపీఎస్, పెంట్లవెల్లి
పెంట్లవెల్లి ఎంపీపీఎస్, సింగవరం
తాడూరు ఎంపీపీఎస్, ఐతోల్
తిమ్మాజిపేట ఎంపీయూపీఎస్, రాళ్లచెరువుతండా
ఊర్కొండ ఎంపీయూపీఎస్, జకినాలపల్లి
ఊర్కొండ ఎంపీయూపీఎస్, జగ్‌బోయిన్‌పల్లి
వంగూరు ఎంపీయూపీఎస్, తిప్పారెడ్డిపల్లి
వంగూరు ఎంపీపీఎస్, నర్సంపల్లి
వెల్దండ ఎంపీపీఎస్, కొట్ర
జిల్లాలో ఎంపికై న పాఠశాలలు ఇవే..
మార్గదర్శకాలు ఇలా..
2026–27 విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో చేరే అవకాశం ఉన్న చిన్నారులు 2025–26లో ప్రీ ప్రైమరీలో చేరాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా వయసు, నిర్ధారణ పత్రాలు అవసరం. వివరాలు యూడైస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.