
వడ్డీ పేరుతో వంచన
చెయ్యి దాటిపోయాకే ఫిర్యాదులు..
అధిక వడ్డీపై ఆశతో పెట్టుబడులు పెడుతున్న బాధితులు తాము మోసపోయామని గ్రహించేందుకే అధిక సమయం పడుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా కొందరు వెనకాడుతుండటంతో చాలా ఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఆలస్యంగా తేరుకుని ఫిర్యాదు చేసినా పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి.. నిందితులను పట్టుకున్నా సొమ్మును మాత్రం రికవరీ చేయలేకపోతున్నారు.
సాక్షి, నాగర్‌కర్నూల్: తమతో కలసి పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని.. రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మబలుకుతూ నిండా ముంచుతున్న ఘటనలు జిల్లాలో పెరుగుతున్నాయి. మధ్యతరగతి, ఉద్యోగులు, వ్యాపార వర్గాలే లక్ష్యంగా కేటుగాళ్లు అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. అధిక వడ్డీ వస్తుందని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారు చివరకు మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. బాధితులు పోలీ
సులను ఆశ్రయించినా.. ని త్యం స్టేషన్ చుట్టూ తిరగడమే కానీ డబ్బులు మాత్రం తిరిగి రావడం లేదు. కష్టపడి సంపాదించిన సొమ్ము కోల్పోయిన బాధితులు దిక్కు తోచని స్థితిలో నిత్యం మదనపడుతున్నారు.
ఫైనాన్స్ కంపెనీ పేరుతో టోకరా..
జిల్లాకేంద్రంలో ఓంశ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీ పేరుతో వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌కు చెందిన సాయిబాబు దందా మొదలుపెట్టాడు. అధిక వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించాడు. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నిర్వాసితులను లక్ష్యంగా చేసుకున్నాడు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిన డబ్బులను డిపాజిట్లుగా సేకరించాడు. సుమారు 1200 మంది నుంచి రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. మోసపోయామని గుర్తించిన బాధితులు.. రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటివరకు డబ్బులు రికవరీ కాలేదు. జీవనాధారమైన భూములను ప్రాజెక్టులో కోల్పోగా.. వచ్చిన అరకొర డబ్బులను పెట్టుబడిగా పెట్టి మోసపోయిన వారి పరిస్థితి దయనీయంగా మారింది.
పూర్తిస్థాయిలో విచారణ..
అనధికార, బోగస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతున్న వారి కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. గ్రో ల్యాండ్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడిన అండమాన్‌కు చెందిన నలుగురిని పట్టుకుని రిమాండ్‌కు తరలించాం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోంది. అధిక వడ్డీ ఇస్తామంటే నమ్మి మోసపోవద్దు. జరుగుతున్న మోసాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి.
– శ్రీనివాస్, డీఎస్పీ, నాగర్‌కర్నూల్
అధిక వడ్డీ ఇస్తామంటూ మోసాలు
ఇటీవల ఓ కంపెనీ పేరుతో రూ. 7కోట్ల వరకు టోకరా
అండమాన్ నికోబార్‌కు చెందిన నలుగురిని అరెస్ట్‌చేసిన పోలీసులు
ఇప్పటికే ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ పేరుతో రూ. 50కోట్లకు పైగా మోసం
జిల్లాలో పెద్దఎత్తున నష్టపోతున్న బాధితులు