
ఉత్సాహంగా సెపక్‌తక్రా పోటీలు
వనపర్తి: వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 11వ అంతర్ జిల్లా సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ సెపక్‌తక్రా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ క్రీడా పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల వారీగా ఒక్కో జిల్లా నుంచి మెన్స్, ఉమెన్స్ రెండు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రతిభకనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా రాణించాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు క్రీడలకు కేటాయించిందన్నారు. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లేందుకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సెపక్‌తక్రా క్రీడలకు సంబంధించి బాల్స్ కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందని ఇందుకు సంబంధించి అట్టి క్రీడకు సంబంధించిన అసోసియేషన్ వారు తమకు నివేదిక ఇస్తే మలేషియా నుంచి బంతుల్ని తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి మెడల్స్ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో మైదానాలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇక జిల్లాకు రూ.57 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయడం జరిగిందని, వచ్చే ఏడాదికి వనపర్తిలో ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. యువత లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించేవరకు కష్టపడాలని, గత ఏడాది తెలంగాణ నుంచి పారా ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన దీప్తి జీవాంజిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పాల్గొన్న 20 జట్లు