
దరఖాస్తుల స్వీకరణతోనే సరి!
వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతులు గ్రామస్థాయిలో ఏఈఓలకు దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు ఎంపిక చేస్తాం. అక్టోబరు చివరి నాటికి పరికరాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం యూరియా ఇబ్బందులు ఉన్న కారణంగా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం నెలకొంది. వారం రోజుల్లో దీనిపై దృష్టి పెడుతాం.
అచ్చంపేట: వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ప్రభుత్వం కానీ వ్యవసాయశాఖ అధికారులు కానీ వాటిని పరిశీలించిన పాపాన పోలేదు. దీంతో పథకం అమలు జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా వివిధ యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
పునరుద్ధరించిన ప్రభుత్వం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిలిపివేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి పునరుద్ధస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. రైతులకు 2024 మార్చి చివరి నాటికే యంత్ర పరికరాలు పంపిణీ చేయనున్నట్లు తొలుత పేర్కొన్నారు. ఈ పథకం కింద 2024–25 సంవత్సరంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 1,341 యూనిట్ల కోసం రూ.3.31 కోట్లు కేటాయించింది. మార్చి 31 నాటికి పరికరాలను గ్రౌండింగ్ చేయాలని, మార్చి 21న ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయం ఉండటంతో అధికారులు సైతం ప్రచారం కల్పించలేకపోయారు. మార్చి 31 తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను పైసా కూడా ఖర్చు చేయలేదు.
నిధులు విడుదల చేస్తూ జీఓ
యాంత్రీకరణ పథకానికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 1,680 యూనిట్లకు గాను రూ.1.38కోట్ల నిధులు మంజూరు చేస్తూ జూలై చివరిలో జీఓ విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరించాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ, జనరల్ కేటగిరికీకి చెందిన రైతులకు 40శాతం సబ్సిడీపై పరికరాలు అందించేలా జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఆగస్టు16 నుంచి 20 వరకు దరఖాస్తులను పరిశీలించి 21 నుంచి 27 వరకు ఎంపికై న రైతుల నుంచి సబ్సిడీ పోను పెట్టుబడి రూపంలో డీడీలను తీసుకోవాలని భావించింది. అనంతరం ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 5 వరకు సబ్సిడీ పరికరాలను మంజూరు ఉత్తర్వులను అందజేసి అక్టోబరు చివరి వారంలో లబ్ధిదారులకు పరికరాలను అందజేసేలా జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసుకున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు.
యాంత్రీకరణ పథకం అమలుపై దృష్టి సారించని ప్రభుత్వం
2025–26 సంవత్సరానికి జిల్లాకు రూ.1.38 కోట్టు మంజూరు
ఇప్పటి వరకు ట్రెజరీలో జమకాని నిధులు
వచ్చిన అర్టీలనూ పరిశీలించని యంత్రాంగం
రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు
– యశ్వంత్‌రావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి