
భూ సేకరణ వేగంగా పూర్తి చేస్తాం
నాగర్‌కర్నూల్: జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి 167కే నిర్మాణ పనులకు భూ సేకరణను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని డాక్టర్ డీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాల కలెక్టర్లు, జాతీయ రహదారుల, రెవెన్యూ అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణాల పురోగతి, భూ సేకరణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి వీసీకి హాజరైన కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ఎన్‌హెచ్ 167 కే కోసం 79.3 కిలోమీటర్ల మేర జిల్లాలో కల్వకుర్తి, కొల్లాపూర్, సోమశిల వరకు 106.7 హెక్టార్ల విస్తీర్ణం భూమి అవసరం కాగా ఇప్పటివరకు 77.5 హెక్టార్ల భూ సేకరణ పూర్తయిందని, మిగిలిన 29.2 హెక్టార్ల భూ సేకరణ పనులను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేసి జాతీయ రహదారుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో భూ సేకరణ పనులు పూర్తి చేస్తామని, కల్వకుర్తి మండలంలో ఉన్న కోర్టు కేసులను పరిగణనలోకి తీసుకొని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, ఆర్డీఓలు సురేష్, బన్సీలాల్, జనార్దన్‌రెడ్డి, నేషనల్ హైవే డీఈ రమేష్‌బాబు, కలెక్టరేట్ భూ సేకరణ విభాగం సూపరింటెండెంట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్,