
‘బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’
అచ్చంపేట/మన్ననూర్: అనారోగ్యంతో బాధపడుతూ మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రిలో మృతిచెందిన చెంచు మహిళ గురువమ్మ మృతదేహాన్ని మార్చూరీ వ్యాన్ డ్రైవర్ పరాహబాద్ చౌరస్తా వద్ద అడవిలో వదిలి వెళ్లడం బాధాకరం అని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లింగాల మండలంలోని ఈర్లపెంటకు చెందిన మండ్లీ గురువమ్మ అనారోగ్యంతో మహబూబ్‌గర్ ప్రభుత్వ అస్పత్రిలో చేరిందన్నారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందగా.. మృతదేహాన్ని ఈర్లపెంటకు తరలించే క్రమంలో మార్చూరీ వ్యాన్ డ్రైవర్ అడవిలో వదిలివెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ అధికారులు చెంచుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నల్లమల అటవీ ప్రాంతంలో జీవనం సాగించే ఆదివాసీల రక్షణ కోసం ఐటీడీఏ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఘటనపై రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా మంత్రి జూపల్లి కష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారని తెలిపారు. త్వరలోనే మంత్రి సీతక్క నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు పెంటలను సందర్శించిస్తారని వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామన్నారు. పెంటల్లో నివసిస్తున్న ఆదివాసీలకు వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆలస్యం చేయకుండా అచ్చంపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించి పూర్తిస్థాయిలో వైద్య సేవలు పొందాలని సూచించారు.