
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. నిరక్షరాస్యతే బాల్య వివాహాలకు ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్ల బాల్యవివాహాలను అరికట్టవచ్చన్నారు. సోషల్ మీడియాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, కొన్ని యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను కేవలం మంచి విషయాలు తెలుసుకునేందుకే వినియోగించాలని, కాలపేక్షం కోసం మొబైల్ ఫోన్లు వాడితే జీవితం నాశనం అవుతుందని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా మాట్లాడుతూ ప్రతి విద్యార్ది లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందుకు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జీ వెంకటరామ్, అడిషనల్ కలెక్టర్ అమర్నాథ్, డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి, సీడబ్ల్యూసీ చైర్మన్ లక్ష్మణరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమాకాంత్, సెక్రటరీ మధుసూదన్ రావు పాల్గొన్నారు.