
పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి
నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 33 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించాలని సూచించారు. పత్తి మార్కెటింగ్ సీజన్ 2025–26లో జిల్లా సగటు దిగుబడి అంచనాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తహసీల్దార్లు జవాబుదారీగా పని చేయాలి
తహసీల్దార్లు ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండడంతో పాటు సమయపాలన పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ఆర్డీఓలతో పాటు 20 మండలాల తహసీల్దార్లతో భూ భారతి, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అసైన్డ్ భూములు, భూదాన్ భూముల పరిరక్షణ, పలు రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల వారీగా రెవెన్యూ అంశాలను తహసీల్దార్లు నిర్లక్ష్యం వహించకుండా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరస్కరించిన ప్రతి దర ఖాస్తుకు సరైన కారణాలు తెలియజేయాలని, వివరాలతో ప్రొసీడింగ్‌ను దరఖాస్తుదారుడికి అందించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు కావాల్సి న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హైకోర్టు, సివిల్ కోర్టు, లోకాయుక్తకు సంబంధించిన కేసులను కూడా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు జనార్దన్‌రెడ్డి, బన్సీలాల్, సురేష్, మాధవి, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు రవికుమార్, వెంకట్, శోభ పాల్గొన్నారు.