
జీపీఓలు రైతులకు అందుబాటులో ఉండాలి
పెద్దకొత్తపల్లి: గ్రామాల్లో ప్రభుత్వం నూతనంగా నియమించిన జీపీఓలు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తూ గుర్తింపు పొందాలని రెవెన్యూ అడిషన్ కలెక్టర్ అమరేందర్ సూచించారు. పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ బన్సీలాల్ ఆధ్వర్యంలో శుక్రవారం కొల్లాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల జీపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణపై ఆర్డీఓ బన్సీలాల్ వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, డీటీ రమేష్‌నాయక్, జీపీఓలు, శిక్షణ పొందిన సర్వేయర్లు పాల్గొన్నారు.
మంత్రికి ఎమ్మెల్యే వినతి
నాగర్‌కర్నూల్: నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి విన్నవించారు. హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. రహదారుల నిర్మాణానికి రూ.20 కోట్లు, గిరిజన భవన నిర్మాణానికి రూ.3 కోట్లు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన మంత్రి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాలోని కొత్త, పాత స్వచ్ఛంద సంస్థల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు సెల్: 9705606304 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

జీపీఓలు రైతులకు అందుబాటులో ఉండాలి